PRTU - Telangana
సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గాల్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి గారి నాయకత్వములో నడుస్తున్న PRTU తెలంగాణ కుటుంబ సభ్యులకు మరియు రాష్ట్ర ఉపాధ్యాయ లోకానికి వినమ్ర నమస్సులతో…
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయమది. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలా లేదా అనే మీమాంసలో ఉపాధ్యాయ సంఘాలు ఉన్న తరుణమది. ఉద్యమంలో చేరితే లాభమా? నష్టమా? మెజారిటీ వ్యక్తులు లెక్కలు వేసుకుంటూ ఆచి తూచి అడుగులు వేయాలని, భవిష్యత్తును పదిల పరచుకొని ఉండాలని ఊగిసలాడుతున్న సంధికాల సమయంలో, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కూడ అంతే ముఖ్యమని భావించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తాను సైతం ప్రధాన భూమికను పోషించాలనే శ్రీ గాల్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి గారి మస్తిష్క తపన నుండి తట్టుకొని వచ్చిన ఆలోచనల పరంపర ఫలితమే PRTU తెలంగాణ ఆవిర్భావానికి నాంది పలికింది. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గోని పోరాడటానికి ఒక వేదిక కావాలనే ప్రగాఢ ఆకాంక్ష రూపమే PRTU తెలంగాణ వ్యవస్థాపనకు ఆజ్యం పోసింది. ఆలస్యం చేయకుండా అప్పటి ప్రధాన ఉపాధ్యాయ సంఘం నుండి వేరుపడి శ్రీ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మరియు వారి మిత్ర బృందం కలిసి రిజిస్ట్రేషన్ సంఖ్య 711/2011 ద్వార శ్రీ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా కార్యవర్గం ఏర్పడి ఆనాటి నుండి నేటి వరకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తూనే ఉంది.